ఓ నాయకుడికి నిర్వచనం ఇస్తే

ఓ నాయకుడికి నిర్వచనం ఇస్తే ప్రజల జీవితాల నాణ్యతా ప్రమాణాలను కొంతైనా మెరుగు పరిచగలిగే వారు అని అర్థం.

ఇంటి బయట రాకుండా.. ఓ ప్రభుత్వ అధికారిని కలవాలి అంటే కూడా మగాడు కలవాలి, ఇంటి పెత్తనం మగాడే చెయ్యాలి అని నరనరానా జీర్ణించుకొని, పంచాయితీలు కూడా మగాళ్లు మాత్రం చేస్తూ, అక్కడ ఆడాళ్లు నోరెత్తితే నోరుమూసుకొని ఇంటికిపో.. ఇక్కడ మగాళ్లు వున్నాం కదా అని తీసి పారేస్తూ.. ఊర్లలో రచ్చకాడ ఆడాళ్లు కనిపిస్తే నేరమైనట్టు చూసే కాలంలో..

డబ్బు చేతిలోకి వస్తే ఖర్చుపెట్టేసే మగాడితో మీ కుటుంబాలు కోలుకోవు.. పొదుపు చెయ్యండి, ఓ సంఘంగా చేరండి అంటే.. సిగ్గు బిడియం వదులుకొని రచ్చల దగ్గర చేరి డ్వాక్రా మహిళల హోదాలో.. ఓ విత్తు వేసి పెంచి.. ఆత్మస్థైర్యం నింపి మహిళల్లో ఓ చైతన్యం నింపి, ఆత్మగౌరవాన్ని నింపడాన్ని ఏ జాతిలో అయినా నాయకుడు అని చెప్పుకోవాలి.

అక్క చెళ్లమ్మా నిన్ను లక్షాదికారిని చేస్తా అని ఆశపెట్టి ముంచే వారిని కనీసం మనిషిగా ఎందుకు భావిస్తుందో సమాజం.

తమకోసం గ్రామాలకు గ్రామాలు చీలి చంపుకొంటూ, ఒకరిని చూస్తే ఒకరు కొట్టుకొంటారేమో అని పోలీసులే భయపడుతూ ఎదురుపడకుండా చేసే ప్యాక్షన్ పరిస్థుతులలో.. వారిని ఒక్కటిగా చేసి ప్రజలకోసం కలవండి అని కలిపి.. ప్రజల మొహాల్లో ఆనందాన్ని ఆస్వాదింపజేసే వాడిని నాయకుడు అంటారు.

తనకు భవిష్యత్తులో అడ్డువస్తారని సొంత పార్టీ అయినా మహా మహా నాయకులను నిలువునా త్రొక్కి, గుండెపోటు వచ్చి చనిపోయేలా అధికారం చూపే వారిని.. మనిషిగా ఎందుకు భావిస్తుందో సమాజం.

ఎంతటి ఆర్థిక లోటు, అప్పులలో కూడా .. ఆస్తులు అమ్మకుండా ఆదాయం పెంచి, సంక్షేమాన్ని అందిస్తూ… విద్య ముఖ్యం.. టెక్నాలజీ మరియు తెలివితేటల్లో మన తెలుగు పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలరు చదివించండి అని యువతకు ప్రోత్సహం ఇస్తూ.. నిరంతరం తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచే వారిని నాయకుడు అంటారు.

జనం ఆస్తులు అమ్మి అడ్డంగా పప్పుబెల్లాల్లా పంచి చదివి తెచ్చుకొన్న సర్టిఫికేట్లు వెక్కిరిస్తుంటే ఇంటి వారసత్వానికి వేలకోట్ల సంపద చేకూర్చే వారిని సమాజం మనిషిగా ఎందుకు భావిస్తుందో.

ఒక పట్టణాన్ని ఉపాధి కేంద్రంగా మార్చడం కాదు, లక్షలాది మంది లక్షల్లో జీతాలు తీసుకొనేలా ప్రపంచాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే వారిని నాయకుడు అంటారు.

ఆ పనులను అర్థం చేసుకోకుండా.. ఏదో మౌస్ అంట ఎలుక తోకలా తిప్పితే జనానికి ఏమొస్తుంది అని ఉన్నత వృత్తి చదువులు చదువుకొన్న మూర్ఖులను సమాజం ఎలా మనిషిగా అనుకొంటుందో.

నేను అడుగుపెట్టిన నేలంతా నీరే అని జెసీబీలతో గీకేసి కోట్ల ధనం పూడిపోయేలా వృధా చేసి మింగేసిన వారిని మనిషి అని ఎందుకు అనుకొంటొందో.

కరువు నేలలో చెరువులు నింపి, అక్కడి నెలలో వేల కోట్ల పెట్టుబడులు తెప్పించి కుమ్మరింపజేసి.. నమ్మలేని వాస్తవాన్ని కళ్లముందు ఆవిష్కరించిన వ్యక్తిని నాయకుడు అంటారు.

రాష్ట్ర కోర్టుల నుండి అమెరికాలాంటి కోర్టుల వరకు దోపిడీల మీద ఆరోపణలు విచారణలు జరుగుతుంటే మహా నేతగా ఆవిష్కరించే లోకంలో.. అవాక్కయ్యే సమాజం స్మృతుల్లో నాయకులు ఎవరో.. కనీసం మానవత్వం వున్న మనిషికూడా కాని వారు ఎవ్వరో అర్థం అవ్వదా.

సొంత కులానికి, చుట్టూ వున్న వందిమాగదులకు చేసే సాయాలు పొందే భజనలు & కీర్తనలకు పొంగిపోయే సంకుచిత ధోరణికి .. యావత్తు సమాజంలో కులమతాలకు అతీతంగా ఆనందాన్ని నింపుతూ దానిని కూడా కొలుస్తూ.. ఇంకా మెరుగుపడేలా చెయ్యాలనే విస్తృత పరిధి మనస్తత్వం వుండే వారిని నాయకుడు అంటారు.

సొంత డప్పు వుంది కదా అని అధికారంతో అలా చేస్తే దేశంలో ఎంతో మందిని నిత్యం అలా ప్రచారం చేసి ఓ జాతికి నాయకులుగా చేసేయవచ్చు. కానీ సాధ్యం కాదు. కాలం ఇంకా వుంది. చాలా నిజాలు చెబుతుంది. మధ్యలో అబద్ధం బుడగలా మధ్యలోనే పగిలిపోతుంది. నిజం నిలకడమీద నిలబడుతుంది. #చాకిరేవు.

0 స్పందనలు to “ఓ నాయకుడికి నిర్వచనం ఇస్తే”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

జూలై 2020
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి